ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక సమాచారాన్ని కెనడాకు ఫైవ్ ఐస్ దేశాల్లో ఒకటి ఇచ్చినట్టు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కెనడాకు అమెరికా నిఘా వర్గాల నుంచే ఈ సమాచారం అందినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం వెలువరించింది. అమెరికా అందించిన సమాచారానికి తోడు కెనడా తన వనరుల ద్వారా మరింత సమకూర్చుకున్నట్లుగా ఈ కథనం తెలిపింది. భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్‌లలోకి చొరబడి సేకరించిన సమాచారం కెనడాకు ఆధారంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలోనే దర్యాఫ్తు విషయంలో సహకరించాలని భారత్‌కు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకేన్ సూచించారని వివరించింది.
‘కెనడా, అమెరికాలు పరస్పరం నిఘా సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ఇందులో భాగంగా ఉద్దేశ్యపూర్వకంగానే నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెజిలెన్స్ సమాచారాన్ని కూడా అమెరికా తన నివేదికలో జొప్పించి కెనడాకు అందించింది’ అని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. అయితే ఈ అంశంపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది. మరోవైపు, తాము సేకరించిన సమాచారాన్ని విడుదల చేసేందుకు కెనడా కూడా సిద్ధంగా లేదు. కానీ పశ్చిమ మిత్రదేశాల అధికారుల ప్రకారం.. కెనడా అత్యంత ఖచ్చితమైన గూఢచర్యాన్ని అభివృద్ధి చేసింది.. దీని ఆధారంగా భారత్ ఏజెంట్ల పాత్రపై ఆరోపణలు చేసింది.
కానీ, నిజ్జర్‌ను చంపేంత వరకు ఈ కుట్ర గురించి లేదా దానిలో భారత్ ప్రమేయాన్ని సూచించే ఆధారాల గురించి అమెరికా తెలుసుకోలేదని నివేదిక పేర్కొంది. నిజ్జర్ ప్రమాదంలో ఉన్నాడని నిరంతరం హెచ్చరించినట్లు నివేదిక తెలిపింది. నిజ్జర్‌కు ప్రాణహాని ఉందని కెనడా అధికారులు హెచ్చరించారని, పలువురు స్నేహితులు, సహచరులు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండమని చెప్పినట్లు తెలిసింది.
జూన్ 18న నిజ్జర్ హత్య తర్వాత అమెరికా స్పందిస్తూ తమకు ఈ కుట్ర గురించి ముందస్తు సమాచారం లేదని కెనడాకు చెప్పినట్టు వివరించింది. నిఘా వర్గాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రకారం తమకు ఏదైనా ముందస్తు సమాచారం ఉంటే వెంటనే చెప్పేవారని తెలిపింది. కాగా, నిజ్జర్ హత్యపై అమెరికా అధికారులు చర్చించడానికి ఇష్టపడరు. ఎందుకంటే సన్నిహిత దేశమైన కెనడాకు సహాయం చేయాలనుకున్నప్పటికీ ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే భారత్ ముఖ్యమైన భాగస్వామిగా అమెరికా భావిస్తోంది.
హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం తారాస్థాయికి చేరింది.
Leave A Reply
Your email address will not be published.*